ఈ ఘటనపై మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ సోమవారం స్పందిస్తూ.. బొల్లార్ మసీదు ముందు బాధితులు కొన్ని నినాదాలు చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు.

“కొణాజే పరిధిలోని బొల్లార్‌లో ఒక బార్ ముందు కత్తిపోట్లు జరిగిన సంఘటన ఒకటి. ముగ్గురు (హిందూ) బిజెపి అనుచరులు బొల్లార్ మసీదు ముందు వెళుతుండగా కొన్ని నినాదాలు చేశారు. బైక్‌లపై 20-25 మంది ముస్లిం యువకులు వారిని అనుసరించారు.

వారు మసీదుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్ ముందు ఆగారు. ముస్లిం యువకులు కూడా వారిని అనుసరించి బార్ వద్దకు వెళ్లడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ముగ్గురిని కొట్టి, ఇద్దరిని పొడిచారు. వారిలో ఒకరు ప్రాణాపాయం నుంచి బయటపడగా, మరొకరికి కేఎస్ హెగ్డే ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోంది’’ అని పోలీసు కమిషనర్ తెలిపారు.

ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జిల్లాలోని బంట్వాల్ పట్టణ సమీపంలోని బొల్లార్‌లో జరిగింది. బాధితులను ఇన్నోలికి చెందిన 41 ఏళ్ల హరీష్, 24 ఏళ్ల నందకుమార్‌గా గుర్తించారు. ఇన్నోలికి చెందిన కృష్ణకుమార్‌ను కూడా ఆ బృందం కొట్టింది.

వారు నిలబడి విజయయాత్రను చూస్తున్నారని, ఊరేగింపును అనుసరిస్తున్న బైక్‌లపై వచ్చిన 20 నుండి 25 మంది దుండగులు అకస్మాత్తుగా దాడి చేసి కత్తితో పొడిచినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.

బాధితులిద్దరూ ప్రస్తుతం దేరాలకట్టెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారిలో ఒకరికి చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. కొణాజె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధితులను పరామర్శించిన అనంతరం బీజేపీ నేతలు, హిందూత్వవాదులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఘటనను ఖండించారు.